సచ్చిదానందం
తెలుసుకున్నవి తెలుసుకున్నట్లు లౌకిక సత్యాలు
బయటపెడితే అందరూ వాటిని అవగాహన చేసుకోగలరా? ఆధ్యాత్మిక సత్యాలు హృదయపరమైనవి. బయటపెట్టినా
సులువుగా అర్థం కానివి. అందుకే ఒక సత్యాన్వేషి
ఓ విషయం చెప్పినప్పుడు, చాలా మంది అజ్ఞానులు వేరొక విషయంగా అర్థం చేసుకుని పొరపడే అవకాశం
ఉంది.
చూపు లేనివాడికి గంటల తరబడి ఏనుగు గురించి
ఎన్ని వివరణలు ఇచ్చినా, అతడి అవగాహనకు ఏనుగు రాదు. మరేదో జంతువు రావచ్చు.
అతడికి కావలసినది మొదట చూపు. చూపు ఇస్తే,
ఏ వివరణలు, వర్ణనలు లేకుండా నేరుగా అతడు ఏనుగును చూడగలడు.
దర్శింపజేసేదే జ్ఞానం. దర్శనీయమైనదే జ్ఞానం.
జ్ఞానం అనుభూతిలోకి రావాలంటే అంతర్నేత్రం కావాలి. మహానుభావులు మనకు దర్శనం ఇస్తారు. దానితో మన అజ్ఞానం పటాపంచలవుతుంది. ఎన్నిసార్లు
చెప్పినా సిద్థాంతపరంగా ఆత్మజ్ఞానం కూడా ఒక శాస్త్రంగానే ఉండిపోతుంది. అనుభవంలోకి రావాలంటే
ప్రేమపూర్వకమైన హృదయం ఉండాలి. సత్యదర్శనం చెయ్యగలిగే అంతర్దృష్టి కావాలి.
తెలుసుకున్నది చెప్పాలనే తహతహ ఉంటుంది. శాస్త్రజ్ఞులు
తాము కనుక్కున్న విషయాలను వీధుల్లోకి పరుగులు తీసి ‘యురేకా యురేకా’ అని అరిచి మరీ చెప్పారు.
యోగ రహస్యాలను తెలుసుకున్న యోగి అంతకంటే వెయ్యి రెట్లు గట్టిగా బయటకు ప్రకటించగలడు.
కాని, ఎంతమంది వాటిని అందుకోగలరు?
సత్యం దర్శించినవాళ్లు, తపస్సు ఫలించినవాళ్లు,
ఉత్తమ యోగులుగా మారినవాళ్లు మౌనం వహించటానికి కారణం ఇదే. తెలుసుకున్నది చెబితే అర్థం
చేసుకుని, అంగీకరించే ప్రపంచం వాళ్ల ముందు లేదు. వాళ్లు ప్రపంచాన్ని దాటి వెళ్లి పోయారు.
మనసును అధిగమించారు. ఇక ఎప్పటికీ అజ్ఞానులతో కలవరు. కలవాల్సిన అవసరం లేదు. భౌతిక రూపాలతో,
బయటకు సాధారణ వ్యక్తుల్లా వాళ్లు కనిపిస్తారు. కాని, వాళ్లు మానవులు కారు. వాళ్లకు
చావు పుట్టుకలతో సంబంధం లేదు. అజ్ఞానులు పడే బాధలతో అసలు సంబంధం లేదు. వాళ్లది నిత్య
నిరంజన పరమానంద స్థితి. ఆ స్థితి నుంచి వాళ్లు దిగిరారు. వాళ్లకు భగవంతుడు స్నేహితుడు.
ఒకరకంగా చెప్పాలంటే, వాళ్లు .. నడిచే దైవాలు!
ఇలా భగవంతుణ్ని తెలుసుకున్నవాళ్లు, లోకానికి
దూరమైపోతే అజ్ఞానులను ఉద్ధరించేవారు ఎవరనే సందేహం కలగవచ్చు. ఎవరికి వాళ్లు స్వయంగా
తెలుసుకుని అనుభవించే అపరోక్ష అనుభూతే భగవంతుడు. ఆయనను గ్రహించడానికి కొంత సహాయం అయితే
ఏదో రూపంలో లభించవచ్చు కాని, చూడాల్సింది మనమే. అందులో లేశమాత్రమైనా సందేహం లేదు.
ఇందులో ఇంత సంక్లిష్టత ఉన్నప్పుడు, దైవం నాకు
లభించాడని చెప్పినవాడి మాటకు ప్రమాణం ఏమిటి? అతడు దైవ సాక్షాత్కారం పొందాడని ఎలా తెలుస్తుంది?
ముఖం చూస్తే తేజస్సు కనిపిస్తుంది కాని, తేజస్సే పరమ ప్రమాణంగా తీసుకోగలమా?
అందుకే భగవద్గీత కొన్ని లక్షణాలు చెప్పింది.
అతడికి స్థితప్రజ్ఞుడు అని పేరు పెట్టింది. భూతదయ కలిగి ఉంటాడంది. మాన అవమానాలకు, శీతోష్ణ
సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడని చెప్పింది. ప్రేమ స్వరూపుడై ఉంటాడని చెప్పింది. కోరికలు
లేనివాడై వైరాగ్యం అనే స్వర్గంలో మునిగి తేలుతుంటాడని చెప్పింది. కామ, క్రోధాదులని
జయించి ఉంటాడని చెప్పింది. ఈశ్వర ప్రణిధానంతో నిత్యం భక్తి అనే గంధం పూసుకొని ఉంటాడని
చెప్పింది.
ఇవి చాలు- ఆ మహానుభావుణ్ని పట్టుకోవడానికి.
ఇందులో ఏ ఒక్కటీ ఆత్మదర్శనం లేకుండా రాదు. వచ్చినా ఉండదు. వీటిని నటించలేరు. వీటితో
ఆడుకోవడానికి కపటులు ప్రయత్నిస్తే అభాసుపాలవుతారు. చివరికి అధోగతికి చేరుకుంటారు.
తెల్లరంగు వేసుకుని కాకి హంసలా విహరిస్తే,
వానాకాలంలో ఏమవుతుంది? బటుడు నాటకంలో రాజు పాత్ర వేసినంత మాత్రాన అతడు ధనవంతుడై పోతాడా?
గులాబి పరిమళాన్ని కాగితం పూలు ఇస్తాయా?
ఒక మానవ దేహంలో దైవం ప్రకటితమైనప్పుడు సత్యం,
చైతన్యం, ఆనందం అన్ని కోణాల్లో వెల్లివిరుస్తాయి. సచ్చిదానందం అంటే ఏమిటో చిన్న బాలుడు
కూడా ఆ సన్నిధిలో అనుభవించగలుగుతాడు. అదే, ఆధ్యాత్మిక వివేకోదయం!
*ఈ వ్యాసం ఈనాడు దినపత్రికలోని
‘అంతర్యామి’ భాగం నుండి గ్రహించబడినది.