Thursday, 6 March 2014

Dampathi



పరమాద్భుత కళాకారుడైన భగవంతుడి సృజన పౌరుషానికి సజీవ సాక్ష్యమే ఈ సృష్టి! ఇది ఆయన గీసినబొమ్మ. ఆయన చేసిన రచన. ఆయన భావుక మహా సౌందర్య శోభ, ప్రకృతిలోని ప్రతి అణువునా ప్రతిఫలిస్తుంది, సమ్మొహనపరుస్తుంది. దాని శ్రేష్ఠతకు సౌందర్యమే ప్రమాణం! భగవంతుడి సృజనలో పరమ రహస్యం దాగి ఉంది. స్త్రీ పురుష ప్రకృతుల మధ్య ఆరాధన, సమర్పణలతో శృంగార సంఘర్షణలో సృష్టి యావత్తూ ప్రభవిస్తుంది. నాగరికమైన కట్టుబాటు ఫలితంగా వివాహ వ్యవస్థ నిర్మాణమైంది. వేదం నిర్దేశించిన ఆ వ్యవస్థ మానవజాతి శారీరక అవసరాలను తీర్చింది. మానసిక బంధాలను కూర్చింది. ఆనురాగ మాధుర్యాన్ని జతపర్చి, ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చింది. భారతీయ వివాహ వ్యవస్థ వాస్తవానికి స్త్రీ పురుష సర్వేంద్రియ సంతర్పణకు దోహదకారి. ఆత్మీయ శిఖరాయమాన పరిపూర్ణ దాంపత్య అపూర్వ అద్వైత అనుభూతికి సహాయకారి!
అద్భుతం అనే మాటను ఒకే అక్షరంలో చెబితే అది స్త్రీ. ఆ అద్భుతాన్ని పురుషుడికి సొంతంచేసే రెండక్షరాల ప్రక్రియ పేరు పెళ్ళి. మూడు ముళ్ళతో మొదలయ్యే నూరేళ్ల బంధాన్ని మూడే అక్షరాల్లో పలికితే - అది దాంపత్యం. దాంపత్య జీవనంలో స్త్రి అనే వీణను అమోఘంగా శ్రుతి చేయగల గొప్ప విద్వాంసుడి నాలుగు అక్షరాల పేరు - పురుషుడు. అలా వారిద్దరి మధ్య ఏర్పడే ఆత్మీయ బంధానికి అయిదక్షరాల మాట - భార్యాభర్తలు. ఆడ, మగ - భార్యాభర్తలయ్యే క్రమానికి ప్రామాణికతను ఆపాదించే ఆరు అక్షరాల తంతు పేరు వైదిక ప్రక్రియ. వేద ప్రమాణాన్ని ఆచరించే భార్యాభర్తలు తమ తలకెత్తుకునే ఏడక్షరాల గొప్ప బాధ్యత - గృహస్థాశ్రమ ధర్మం. ఇదే సప్తపది..! ఏడు అంచెల జీవన మాగంల్య మహాసూత్రం.
         ఏడు అడుగులతో పురుషుడి జీవితంలోకి ప్రవేశించే స్త్రీ- అప్పటిదాకా తన వెంట వచ్చిన ఇంటి పేరును, గోత్రాన్ని, ప్రాణమిత్రుల్ని, అన్నదమ్ముల్ని- ఆఖరికి తన తల్లిదండ్రులను, వారి గారాబాన్ని.. అన్నీ విడిచిపెట్టి వస్తుంది. ఇకపై తన భర్త నుంచి - ఆ వదులుకున్నవన్నీ పొందగలనన్న నమ్మకంతో వస్తుంది. అందుకే పెళ్ళిచూపులలో భావం కలగాలని వేదం అంటుంది. ఈమె నా కోసం పుట్టింది అనే భావం పురుషుడికి కలగాలి. ఇతడు నాకోసం ఉన్నాడు అన్న భరోసా స్త్రీకి కలగాలి. సప్తపది మంత్రాల్లో పురుషుడి నోట పలికించే వాగ్ధానం అదే ! ఏడడుగులు నాతో నడిచి మిత్రురాలివి కా! ఒకరికొకరం చక్కని స్నేహితులమై జీవిత పర్యంతం కలిసి నడుద్దాం- అని పురుషుడు పలుకుతాడు. నిజానికి సుముహుర్తం అంటే - బెల్లం జీలకర్ర తంతు కాదు, తొలి చూపులో పురుషుడి కంటి నుంచి స్త్రీకి సర్వభద్రంకరమైన ఆ భరోసా ప్రసారమయ్యే క్షణాన్నే శుభముహుర్తం అనాలి. తెర తొలగించాక జరిగే ఈ చూపుల కలయికనే చక్షు సంయోగం అంటారు. ఆ సమయంలో మంచి మనసుతో చేసిన ఆ వాగ్దానాన్ని పురుషుడు జీవితాంతం నిలబెట్టుకోవాలి. భర్త సమక్షంలో ఉండే సమయంలో స్త్రీకి తండ్రి గుర్తొచ్చినా, బెంగ కలగకూడదు.. తల్లి తండ్రి లేదన్న లోటు తెలియకూడదు. తోబుట్టువులు, స్నేహితులు ఎవరి గురించీ దిగులు పుట్టకూడదు. వారినుంచి గతంలో ఆమె ఎన్నెన్ని రకాల ఆప్యాయతలను పొందిందో, అన్ని రకాలనూ ఆమె తన భర్తనుంచి అందుకోగలగాలి. పురుషుడు స్త్రీకి అన్ని కోణాల్లోంచీ బంధువు కావాలి. స్పర్శలో, మాటలో, చేతలో, చూపులో.. అంతెందుకు - తన పురుషుడి స్మరణమాత్రం చేత స్త్రీ మనసు రాగరంజితం కావాలి. పురుషుడు స్త్రీకి సఖుడు కావాలంది వేదం. సఖ్యం అనే మాట పెళ్ళి మంత్రాల్లో విశేషంగా ధ్వనిస్తుంది. పైన చెప్పిన ప్రతి చేష్టలోనూ స్త్రీకి సఖ్యత అనేది అనుభవంలోకి రావాలి. అతడి లాలనలో ఆమె అనుక్షణం పరవశం చెందుతూ ఉండాలి. ఆమె గుండెలో అది ఒకానొక ఆకుపచ్చని పులకరింతగా స్థిరపడి.. అతడు ఎక్కడున్నా చెంతనే, తనకు తోడుగా ఉన్నాడన్న భావం కలిగిస్తూ- అనుభూతి పరిమళాన్ని పంచుతూ ఉండాలి. దీన్నే సర్వేంద్రియ సంతర్పణం అంటారు. స్త్రీలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుందది. అటువంటి పురుషుడికి స్త్రీ తన సర్వస్వాన్నీ ఇష్టంగా ధారపోస్తుంది. ఆమె అలా చేయాలంటే, పురుషుడు రసజ్ఞ మనోజ్ఞ ప్రతిభామూర్తి అయి ఉండాలి. ఈ సృష్టిలో కృష్ణుడొక్కడే పురుషుడు అని మీరబాయి అనడంలో అంతరార్థం అదే ! భార్య పస్తులుంటే భర్తకు అన్నం సయించని స్థితి కలగాలి. ఆమెకు కష్టమొస్తే తనకు నొప్పి తెలియాలి. ఇంటిదగ్గర ఆమె ఒంటరిగా ఉందని ఏదో తెలియని దిగులు వంటిది మనసుకు తోచాలి. త్వరగా ఇల్లుచేరాలన్న ఆరాటం కలగాలి. తహతహ పుట్టాలి.
         ఇవన్నీ స్త్రీకి వర్తిస్తాయి.. దాంపత్య బంధంలోని చమత్కారం అదే ! స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలు. ఇల్లాలికి గౌరవవాచకం తల్లి. ఆ రెండుహోదాలనూ స్త్రీకి కట్తబెట్టేది వివాహ బంధమే! స్త్రీకి జీవితంలో సర్వశ్రేష్టమైన ఆనందం అనుభవమయ్యేది- అమ్మ అయినప్పుడే. స్త్రీ జన్మకు తల్లికావడమే ధన్యత. భర్తకు తనను తాను సంపూర్ణంగా సమర్పణం చేసుకుని స్త్రీ తరించాలి. భార్యాభర్తలను వేదం దంపతులు అనదు - దంపతి అంటుంది. అలాంటి అధ్వైత స్థితిలో అతడు పూవయితే,  ఆమె పరిమళం. అతడు చంద్రుడైతే, ఆమె వెన్నెల. అతడు దీపం, ఆమె వెలుగు, అతడు వాక్కు అయితే ఆమె దాని అర్థం. శివపార్వతుల బంధాన్ని కాళిదాసు అలాగే కీర్తించాడు. ఆలుమగలు ఆడదిగా మగాడిగా మిగిలిపోకుండా దంపతిగా మారినప్పుడే  సమభాగం, సమభోగం, సమయోగం అన్న భావన సార్థకం అవుతుంది. ఇదే భారతీయ దాంపత్య రసయోగంలోని సారాంశం. స్త్రీ పురుషులు తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన పాఠ్యాంశం!.

No comments:

Post a Comment